Araku కాఫీ రైతుల నష్టాన్ని విస్మరించిన మోడీ

  • మన్‌కీబాత్‌పై సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ఆదివాసీ రైతుల కృషితో ఆర్గానిక్‌ కాఫీ సాగువల్ల అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీ గుర్తింపు పొందిందని, దీన్ని మోడీ మన్‌కీబాత్‌లో గుర్తించకపోవడం అన్యాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులను విస్మరించి కాఫీ సాగు గురించి మాట్లాడటం మోసం చేయడమేనని సిపిఎం రాష్ట్ర కమిటీ భావిస్తోందని తెలిపారు. దేశ ప్రధాని మోడీ మన్‌కీబాత్‌లో చంద్రబాబు నాయుడుతో కాఫీ తాగిన ఫోటోను పోస్ట్‌చేసి, అరకు కాఫీ ఆర్గానిక్‌ కాఫీ రుచికి శ్రేష్టమైనదని, జి20 సదస్సుకు హాజరైన అందరికీ అరకు కాఫీ అందించామని, అందురూ అద్భుతమని కొనియాడారని మోడీ పేర్కొన్నారని తెలిపారు. అంత అద్భుతమైన కాఫీని పండిస్తున్న 1.5 లక్షల మంది రైతుల శ్రమ, గిట్టుబాటు ధర గురించి ప్రస్తావించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. దేశంలో పర్యావరణ సమతుల్యత కోసం గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ పంట, దీనికి విశాఖ ఏజెన్సీ అనువైనదని తెలిపారు. 1982 నుండి విశాఖ ఏజెన్సీలో కాఫీ, సిల్వర్‌ ఓక్‌ సాగును ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని, పోడు వ్యవసాయానికి స్వస్తిపలికి కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో గిరిజనులు వారి ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారని వివరించారు. ఆదివాసీ కాఫీ రైతులకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో తీవ్రంగా మోసపోతున్నారని, వాతావరణం అనుకూలించనప్పుడు కాఫీ పంటరాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అరకు పంటకు కేంద్రం కనీసం ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా కల్పించలేదని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల నుండి కాఫీ రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు తగ్గించేసిందని వివరించారు. 2018 నుండి ఇవ్వాల్సిన రూ.62 కోట్లు ప్రోత్సాహాన్ని ఇవ్వకుండా మొండి చేయి చూపించిందని వివరించారు. కేంద్ర విధానాల వల్ల ఎపిఎఫ్‌డిసి, కాఫీ ఎస్టేట్‌లు మూతపడుతున్నాయని, బోర్డును నిర్యీర్యం చేస్తున్నారని అన్నారు. ఫలితంగా గిరిజనులు ఉపాధి కోల్పోతున్నారని, గిరిజన భూముల్లో పండిస్తున్న కాఫీ తోటల్లో ఉపాధి పథకం కింద పనిచేస్తున్న పనులు కూడా నిలిపేశారని, ఉపాధి నిధులు కేటాయించకుండా గిరిజనులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. జిసిసి ద్వారా కాఫీ గింజలు కొనుగోలు చేయాలని, జిసిసికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో రైతుల నుండి తక్కువ కాఫీ గింజలు కొంటోందని పేర్కొన్నారు. దీనివల్ల దళారులు, స్వచ్ఛంధ సంస్థలు ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ప్రధాని మోడీకి అరకు కాఫీపై ప్రేమ ఉంటే నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. కాఫీ బోర్డుకు, ఎపిఎఫ్‌డిసి, జిసిసిలకు తగిన నిధులు కేటాయించి బలోపేతం చేయాలన్నారు.

➡️