రైతు, కార్మిక వ్యతిరేకి మోడీ

Mar 14,2024 22:45 #Anti-farmer, #anti-labour, #Dharna, #modi
  • కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మహాపంచాయత్‌
  • మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు
  • స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పోరాటం

ప్రజాశక్తి – యంత్రాంగం : రైతు, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను నిరసిస్తూ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న మహా పంచాయత్‌ కార్యక్రమానికి మద్దతుగా అఖిలపక్ష రైతు, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రదర్శనలు నిర్వహించారు. రైతు నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, మద్దతు ధర ఇవ్వాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని, రైతాంగ ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని నినదించారు.
విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎపి రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు మాట్లాడారు. కార్పోరేట్‌ల సేవలో తరిస్తోన్న బిజెపిని ఓడించడం ద్వారానే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు పురోభివృద్ధి చెందుతాయని, లేదంటే వినాశనమేనని అన్నారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ… వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ల గుప్పెట్లోకి నెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని విమర్శించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… రైతులకు ఇచ్చిన మాటను తప్పిన మోడీని గద్దె దించాల్సిందేనని అన్నారు. ఎపి వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, సిఐటియు నాయకులు కె సుబ్బరావమ్మ, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, ఇఫ్టు, రైతుసంఘం నాయకులు పాల్గొన్నారు.


కర్నూలులో జిల్లా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి రూ.రెండు లక్షల కోట్లు కేటాయించాలని, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు.
విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన సంఘీభావ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పాల్గొని, మాట్లాడారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అనకాపల్లిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడారు.కాకినాడలో ఇంద్రపాలెం లాకుల వద్ద అంబేడ్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ధర్నా చేపట్టారు.


శ్రీకాకుళం, ఒడిశాలోని పర్లాకిమిడిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్‌ పాల్గొన్నారు. అనంతపురంలో లలిత కళాపరిషత్‌ నుంచి టవర్‌ క్లాక్‌ వరకు, తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకూ సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం తాలూకా సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద తెలిపిన నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి పాల్గొన్నారు. విజయవాడ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప, పశ్చిమగోదావరి, విజయనగరంలో ప్రదర్శనలు చేపట్టారు.

➡️