నేను124 సార్లు బటన్‌ నొక్కాను..మీరు 2 బటన్లు నొక్కండి

Feb 4,2024 08:13 #ap cm jagan, #speech

ప్రతిపక్షానికి ఓటేస్తే…పథకాల రద్దుకు ఆమోదించినట్టే!

-ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై వివరించండి

-ఏలూరు ‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి: ‘గత 57 నెలల పాలనా కాలంలో 124 సార్లు బటన్‌ నొక్కి మీ ఖాతాల్లో రూ.2.55 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం వేసింది. మీరు ఎంఎల్‌ఎ అభ్యర్థికి, ఎంపి అభ్యర్థికి రెండు బటన్‌లు నొక్కి మీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించండి’ అని వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగన్‌కు ఓటువేయకుండా, ప్రతిపక్షాలకు ఓటేస్తే పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని, మంచి జరగాలంటే జగన్‌ను మరిచిపోకూడదని పేర్కొన్నారు. పథకాలతో లబ్ధి పొందిన వారంతా స్టార్‌ క్యాంపెయినర్లుగా మారాలన్నారు. 2024 ఎన్నికల సన్నాహాకాల్లో భాగంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన వైసిపి ఆధ్వర్యాన ‘సిద్ధం’ సభ ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం జరిగింది. ఈ సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పేదల భవిష్యత్తును కాటేసే కరోనా లాంటి దుష్ట చతుష్టయంపై సంగ్రామానికి అక్క చెల్లెమ్మలు, అవ్వ, తాతలు, సోదరులు, స్నేహితులు అంతా సిద్ధంగా ఉండాలన్నారు. రామాయణ, మహాభారతంలోని విలన్లు వంటి చంద్రబాబు, దత్తపుత్రుడు, పలు మీడియా సంస్థలు, ఇతర పార్టీల్లోని కోవర్టులు తోడేళ్లంతా ఏకమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే జగన్‌ ఒంటిరివాడిలా కనిపిస్తాడని, అయితే, తాను ఏనాడూ ఒంటరి కాదని, కోట్ల మంది ప్రజలు గుండెల్లో తనను పెట్టుకున్నారని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో మీరు, అర్జునిడిలా నేను మన ప్రభుత్వం చేసే మంచిని అస్త్రల్లా సంధించాలి’ అని అన్నారు. మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలతో పేదల భవిష్యత్తుపై దాడి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 175 ఎంఎల్‌ఎ, 25 ఎంపి స్థానాలూ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబు మీ ఇంటికి, ఊరికి, మీ సామాజిక తరగతికి ఏం చేశాడో అడగాలన్నారు. పదేళ్ల్లలో మీ బ్యాంకు ఖాతాలు చూసుకోవాలని, గడిచిన ఐదేళ్లలో మీ బ్యాంకు ఖాతాల్లో జమైన సొమ్ము చూడాలని కోరారు. లంచాలు, వివక్షకు తావులేకుండా డిబిటి ద్వారా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు.

మళ్లీ పెట్టెలో పెట్టి బంధిస్తే చంద్రగ్రహణాలు ఉండవు

గత ఎన్నికల్లో పెట్టెలో పెట్టి బంధించిన చంద్రముఖిల బెడద శాశ్వతంగా వదిలించుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రముఖి సైకిల్‌ ఎక్కి, టీ గ్లాస్‌ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ అబద్దాలు, మోసాలతో మీ తలుపు తట్టి ఇంట్లోకి వస్తుందని విమర్శించారు. ‘రా… కదలిరా’ అంటూ పిలిచేది ప్రజలను కాదని, దత్తపుత్రుడిని ప్యాకేజీల కోసం పిలుస్తున్నారని, కమలం పార్టీలో ఉన్న వదినమ్మను, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, వైఎస్‌ఆర్‌ పేరును ఛార్జిషీటులో పెట్టిన పార్టీని పిలుస్తున్నారని దుయ్యబట్టారు. సైకిల్‌ తొక్కడానికి ఇద్దరిని, తోయడానికి ఇద్దరిని ‘రా… కదలిరా… అంటున్నారని ఎద్దేవా చేశారు. పొత్తులు లేకపోతే 175 సీట్లలో వీరికి అభ్యర్థులు లేరని, దిగజారుడు పార్టీలన్నీ నన్ను టార్గెట్‌గా చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గన్నారు. లక్షల సంఖ్యలో సభకు వస్తారని ఆశించినప్పటికీ జనం పెద్దగా రాక గ్యాలరీలన్నీ ఖాళీగా ఉండడం చర్చనీయాంశమైంది.

➡️