నాటక రంగానికి ప్రోత్సాహం

  • బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి అంబటి
  • ముగిసిన నంది నాటకోత్సవాలు
  •  ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ పురస్కారాల అందజేత

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సమాజానికి ప్రాణప్రధానమైన నాటక రంగాన్ని, నాటకరంగ కళాకారులను ప్రోత్సహించేందుకు నంది నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన నందినాటకోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. మంత్రి అంబటి మాట్లాడుతూ టివి, సినిమా కళాకారులు ఎంతో కొంత సంపాదిస్తారని, నాటక రంగంలోని కళాకారులు సంపాదించినదానికంటే కోల్పోయిందే ఎక్కువని అన్నారు. ఇటువంటి కళాకారులను ఆదుకోడానికి నాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 2022-23 సంవత్సరానికి ‘ఎన్‌టిఆర్‌ రంగస్థల’ అవార్డును విశాఖపట్నంకు చెందిన ప్రముఖ రంగస్థల నటులు, రచయిత డాక్టర్‌ మీగడ రామలింగస్వామికి మంత్రి ప్రదానం చేశారు. గజమాలతో సన్మానించి జ్ఞాపిక, రూ.1.50 లక్షల చెక్కు అందించారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అవార్డు’ను కాకినాడకు చెందిన యంగ్‌ మెన్స్‌ హ్యపీ క్లబ్‌ ప్రతినిధులను సత్కరించి జ్ఞాపిక, రూ.5 లక్షల చెక్కును అందజేశారు. సీనియర్‌ నాటక కళాకారులు కెఎస్‌కె సాయిని ఈ సందర్భంగా సత్కరించారు. నంది నాటకోత్సవాల తుది పోటీలకు సంబంధించి 38 ప్రదర్శనలు జరిగాయి. ఉత్తమ ప్రదర్శనలుగా పద్య నాటకాలు- మాధవ వర్మ, శ్రీకాంత కష్ణమాచార్య, వసంత రాజీయం, సాంఘిక నాటకాలు- ఇంద్రప్రస్తం, ద ఇంపోస్టర్స్‌, కలనేత, సాంఘిక నాటికలు – ఆస్థికలు, కమనీయం, చీకటి పువ్వు, బాలల నాటికలు – ప్రపంచ తంత్రం, బాధ్యత, మూడు ప్రశ్నలు, యూనివర్సిటీ/కాలేజి నాటికలలో ‘ఇంకానా’, కపిరాజు, ఉద్దం సింగ్‌ ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి చైర్మన్‌ పోసాని కృష్ణ మురళీ, మేనేజింగ్‌ డైరక్టర్‌ తమ్మా విజరుకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️