అరాచక పాలనకు చరమగీతం పాడాలి – నారా భువనేశ్వరి

Apr 6,2024 22:55 #Nara Bhuvaneshwari, #paryatana

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనకు చరమగీతం పడాలని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందని, అప్పుడు అన్ని తరగతులకు మంచి జరుగుతుందని అన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సందర్భంగా గుండెపోటుతో మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చారు. తొలుత జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాలులో నంద్యాల నియోజకవర్గ ముస్లిము మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఆనాడు నందమూరి తారక రామారావు పేదవారికి పట్టేడన్నం పెట్టాలని, పేదలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. అదే అడుగు జాడల్లో నారా చంద్రబాబు నాయుడు నడుస్తూ.. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని వివరించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం నాగులోటి గ్రామంలో చిన్న మాసూన్‌ సాహెబ్‌ కుటుంబాన్ని, పాణ్యం నియోజవర్గం కల్లూరు అర్బన్‌ 37వ వార్డు ఉల్చాలా రోడ్డు సెంటర్‌కు చెందిన నరసింహులు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. కార్యకర్తలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. భువనేశ్వరి వెంట నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండి ఫరూక్‌, మాజీ మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు.

➡️