వ్యవసాయ కార్మికుల కోసం దేశవ్యాప్త ఉద్యమాలు

  • వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌

ప్రజాశక్తి-బి.కొత్తకోట (అన్నమయ్య జిల్లా) : వ్యవసాయ కార్మికుల జీవితాల్లో గణనీయమైన అభివృద్ధి జరగాలంటే భూ సంస్కరణలు అమలు జరగడమే మార్గమని, అందుకోసం వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్త ఉద్యమాలు చేపడుతుందని ఆ సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా హార్సిలీహిల్స్‌లో జరుగుతున్న ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త ఉద్యమాలు బలోపేతం కావాల్సిన అవసరముందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వలన వ్యవసాయ రంగం కుదేలవుతోందని వివరించారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలు పెద్దఎత్తున పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం విశేషమైన కృషి చేసిందని తెలిపారు. వ్యవసాయ ఉద్యమాలు మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీలో నూతన కార్యాలయ భవన నిర్మాణం చేపట్టామని, ఈ భవన నిర్మాణానికి వ్యవసాయ కార్మికులు నిధులు అందించి సహకరించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి పని ప్రదేశాల్లో పర్యటనలు చేసి సమస్యలు గుర్తించాలని, వాటి పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, రవి, నారాయణ, పుల్లయ్య, అన్వేష్‌, ఓబులరాజు, పెద్దన్న, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

➡️