నట్టేట పోలవరం నిర్వాసితులు

Jun 17,2024 02:30 #Natteta, #polavaram, #resident

-పరిహారం, పునరావాసం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు
-కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో ముంపు బారిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు
-కొత్త ప్రభుత్వమైనా న్యాయం చేయాలని వేడుకోలు
-నేడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి:పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షలు, 2006కు ముందు సేకరించిన భూములకు రూ.ఐదు లక్షలు పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని వైసిపి ప్రభుత్వం విస్మరించింది. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో వరదల సమయంలో ఏటా గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. పరిహారం అందించకపోవడం, గ్రామాలను తరలించకపోవడంతో నిర్వాసిత గిరిజనులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దీని నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అయితే, కేంద్రంలోని మోడీ సర్కార్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు.
పాలకుల నిర్వాకం ఫలితంగా పోలవరం నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాలకులు ప్రాజెక్టు పూర్తి గురించి మాట్లాడుతున్నారే తప్ప, సర్వం కోల్పోయి చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు బతుకీడుస్తున్న నిర్వాసితుల గురించి ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం పూర్తవడంతో ఏటా జులై, ఆగస్టుల్లో గోదావరి వరదలకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వందకుపైగా గ్రామాలు నీట మునుగుతున్నాయి. పరిహారం విషయంలో ఇచ్చిన హామీని గత వైసిపి ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది. ఏటా వరదలకు గ్రామాలు నీటమునగడంతో జనం పునరావాస శిబిరాలకు, కొండలు గుట్టలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తోంది. 2022 వరదల అనంతరం వేలేరుపాడు మండలంలో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ అదే ఏడాది డిసెంబర్‌ కల్లా నిర్వాసితులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. 2023లో వచ్చిన వరదలకు కుక్కునూరు మండలం గొమ్ముగూడెం విచ్చేసిన ఆయన 2024 జనవరి కల్లా పరిహారం ఇస్తామని చెప్పారు. తాము అధికారంలోకొస్తే పునరావాస ప్యాకేజీ రూ.6.25 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుతామని, 2006కు ముందు సేకరించిన భూములకు ఎకరాకు రూ.ఐదు లక్షలు పరిహారం ఇస్తామని 2019 ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి. ఇవేవీ అమలుకు నోచుకోలేదు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 110 గ్రామాల పరిధిలో సుమారు 20 వేలకుపైగా నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు పునరావాస ప్యాకేజీగానీ, యువతకు పరిహారంగానీ అందలేదు. నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. పరిహారం ఇవ్వకుండా, హామీలను అమలు చేయకుండా బలవంతంగా తమను గ్రామాల నుంచి ప్రభుత్వం వెళ్లగొట్టాలని చూస్తోందని నిర్వాసితులు అప్పట్లో తీవ్ర ఆందోళన చెందారు.
నిర్వాసితులకు పరిహారం పూర్తి స్థాయిలో అందించాలంటే రూ.30 వేల కోట్లు వరకూ ఖర్చవుతుందని గత టిడిపి ప్రభుత్వ హయాంలో అంచనాలు వేసి కేంద్రానికి పంపించారు. ప్రాజెక్టుకు మొత్తం రూ.52 వేల కోట్లు వరకూ ఖర్చవుతుందని కొత్త డిపిఆర్‌ తయారు చేసి పంపించినా కేంద్రం నుంచి స్పందన లేకుండాపోయింది. మళ్లీ జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉంది. ముందుగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చి వారిని నిర్వాసిత కాలనీలకు తరలించాలి. లేకపోతే వరదలకు తలోదారి అన్నట్లు పరిస్థితి ఏర్పడనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తమ తొలి ప్రాధాన్యతగా చెబుతోంది. ఈ దృష్ట్యా పోలవరం నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారంపై కటాఫ్‌ డేట్‌పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొంతమందికి ఇప్పటికీ భూమికి భూమి ఇవ్వలేదు. అలాంటి సమస్యలనూ పరిష్కరించాలి. నిర్వాసితులను త్యాగధనులుగా కీర్తిస్తున్న ప్రభుత్వాలు వారికి న్యాయం మాత్రం చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సోమవారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు.

➡️