పంచ గ్రామాలపై నిర్లక్ష్యం

Feb 5,2024 10:18 #five villages, #neglects
  • భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ, మానవహారం

ప్రజాశక్తి- వేపగుంట, సింహాచలం (విశాఖపట్నం) : పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ బాధిత రైతులు, ప్రజలు ఫ్ల కార్డులతో ఆదివారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వేపగుంట జంక్షన్‌ ముత్యాలమ్మ అమ్మవారి గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ సింహాచలంలోని తొలి పావంచా వరకూ సాగింది. సుమారు 25 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించకపోతే రానున్న కాలంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాలకుల మోసపూరిత వైఖరిని నిరసించారు. భూ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో తాము కొత్తగా ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నామని, కుటుంబ అవసరాలకు ఇంటిని అమ్ముదామన్నా కుదరడం లేదని వాపోయారు. ఇళ్ల స్థలాల యజమానులను, సాగుదారులను హక్కుదారులుగా గుర్తించాలని, 1903 సర్వే సెటిల్‌మెంట్‌ (గిల్‌మెన్‌) రికార్డు ఆధారంగా భూ సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం సింహాచలం వద్ద మానవహారం నిర్వహించారు. దీనికి ముందు సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టివి.కృష్ణంరాజు మాట్లాడుతూ పంచగ్రామాల సమస్య పరిష్కారానికి పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. ఎన్నికల ముందు హడావుడిగా జిఒలు విడుదల చేస్తున్నారని, ఆ తర్వాత వాటిని గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాజకీయాలకు అతీతంగా తమ సంఘం నుంచి తమ ప్రతినిధిగా ఒక అభ్యర్థిని నిలిపి గెలిపించుకొని ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విబిఎన్‌.ప్రతాప్‌, కెఆర్‌కె.ప్రసాద్‌, బి.శంకర్రావు, వి.హనుమంతరావు, పంచగ్రామాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం గ్రామాలను పంచగ్రామాలుగా పిలుస్తున్నారు. ఈ గ్రామాల పరిధిలో 25 వేల కుటుంబాలకు చెందిన సుమారు లక్షమంది నివాసం ఉంటున్నారు. 2010లో విశాఖ ఆర్‌డిఒ ఇచ్చిన ఆర్డర్‌, 2014లో ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన రిపోర్టు, 1903 సర్వే సెటిల్‌మెంట్‌ (గిల్‌మెన్‌) రికార్డు ప్రకారం ఈ గ్రామాల్లోని భూములపై తమకు పూర్తి హక్కు కల్పించాలని రైతులు, ప్రజలు పోరాడుతున్నా పాలకులు స్పందించడం లేదు. 1996-97లో విశాఖ ఆర్‌డిఒ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ భూములపై తమకు మాత్రమే అధికారం ఉందని సింహాచలం దేవస్థానం అధికారులు వాదిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు, నివాసదారులకు అనుకూలంగా వంద రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు.

➡️