గంగవరం పోర్టు కార్మికులతో చర్చలు విఫలం – రేపు మరోసారి సమావేశం

ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) :సమస్యల పరిష్కారానికి అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం, కార్మికుల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తొలుత అక్కయ్యపాలెంలోని జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలోనూ, ఆ తరువాత నగర పోలీస్‌ కమిషనరేట్‌లోనూ చర్చలు జరిగాయి. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన చర్చల్లో జెసిఎల్‌ గణేష్‌, అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ లక్ష్మీనారాయణ, గంగవరం పోర్టు డిజిఎం నారాయణతో పాటు కార్మికుల పక్షాన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పాల్గన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ కార్మికులకు మేజర్‌ పోర్టుల్లో కార్మికులకు ఇచ్చినట్లుగా రూ.36 వేలు వేతనం చెల్లించాలని, అక్రమ బదిలీలను నిలుపుదల చేయాలని, సస్పెండ్‌ చేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని, క్యాంటీన్‌ సదుపాయం కల్పించాలని కోరారు. ఆ డిమాండ్లన్నీ మినిట్స్‌ బుక్‌లో జెఎసిఎల్‌ కార్యాలయంలో నమోదు చేశారు. పై డిమాండ్లకు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం నుండి సానుకూలంగా స్పందన రాలేదు. చర్చల్లో గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బి.జగన్‌, కొవిరి అప్పలరాజు, తదితరులు పాల్గన్నారు. అనంతరం పోలీసు కమిషనరేట్‌లో సిపి రవిశంకర్‌ సమక్షంలో మరోసారి చర్చలు జరిగాయి. వీటిలోనూ ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇలా రెండు చోట్లా చర్చలు విఫలయమ్యాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ చర్చలు జరగనున్నాయి. పోలీస్‌ కమిషనర్‌ దగ్గర జరిగే చర్చలకు అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం కూడా హాజరుకానున్నాయి.

➡️