వేసవి ప్లాన్‌ ఏదీ? -సమీక్షలతోనే సరి

Apr 4,2024 00:16 #summer plan

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో భానుడి భగభగలు తీవ్రమౌతున్నాయి. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకృతి విపత్తులశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు కనీస మట్టాలకు పడిపోయాయి. విజయవాడ నగరానికి నీరందించే కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వద్ద తొమ్మిది అడుగులకు పడిపోయింది. అయితే దీనికి తగిన విధంగా వేసవి కార్యాచరణ ప్రణాళిక ఇంత వరకు సిద్ధం కాలేదు. అధికారయంత్రాంగం సమీక్షలతోసరిపెడుతోంది తప్పితే ఆచరణలో అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. నాగార్జునసాగర్లో 136 టిఎంసిలు, శ్రీశైలంలో 34 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. పులించితలలో డెడ్‌ స్టోరేజీ 3.61 టిఎంసిలు అయితే ప్రస్తుతం 4.23 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. విజయవాడ అవసరాల పేరుతో అక్కడున్న నీటిని ప్రకాశం బ్యారేజీకి వదిలేశారు. బ్యారేజీలోనూ నగరానికి నీరందించే ఇన్‌టేక్‌వెల్స్‌కు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం బ్యారేజిలో 1.49 టిఎంసిల నిలువ మాత్రమే ఉంది. ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది.వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు మార్చి నాటికే యాక్షన్‌ ప్లాను ప్రక్రియ పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం చేయాలనే ఉద్దేశంతో మార్చి చివరివాలరంలో హడావుడిగా సిఎస్‌ సమావేశాలు నిర్వహించారు తప్ప కార్యాచరణ అడుగులు పడలేదు.
పాడైన బోర్లు
పట్టణ ప్రాంతాల్లో పాడైన బోర్లను బాగుచేసే పనికి ఇంతవరకు ఒక్క మున్సిపాలిటీ కూడా నిధులు కేటాయించలేదు. టెండర్లూ పిలవలేదు. దాదాపు అన్ని పురపాలక సంస్థల్లోనూ ఈ విషయమై ఫిర్యాదులు అందుతున్నాయి. కర్నూలు నగరంలో రెండు రోజులకు ఒకసారి, పత్తికొండ నియోజకవర్గంలో వారానికి ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. ఈ నేపధ్యంఓనే కొడుమూరులో మహిళలు నీటికోసం సిఎంను అడ్డుకున్నా.కర్నూలుతోపాటు, డోన్‌, కొడుమూరు, రాయచోటి నియోజకవర్గాల్లోనూ సమస్య ఎక్కువగానే ఉంది. వీటితోపాటు ప్రకాశం జిల్లాలో నీటి సమస్య ఎక్కువగానే ఉంది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ సమస్య తీవ్రమవుతోంది. చెరువులు నింపడానికి ప్రత్యేక కార్యాచరణ ఏదీ రూపొందించలేదు.
అధికారుల నియామకం ఎప్పుడు?
మార్చి రెండవ వారంలోనే వేసవి యాక్షన్‌ప్లాను రూపొందించడంతోపాటు దాని అమలుకు ప్రతి జిల్లాకు పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారిని నియమించాలి. పెరిగిన అసవరాల రీత్యా యాక్షన్‌ ప్లానుకు రూ.1500 కోట్ల నుండి రూ.2000 కోట్లు అవసరం ఉంటుంది. కానీ నిధులు కేటాయింపు జరగలేదు. వేసవి యాక్షన్‌ప్లానును పర్యవేక్షిస్తున్న ప్రకృతివిపత్తుల శాఖ కూడా దీనిపై ఎటువంటి ప్రకటనా చేయలేదు.

➡️