సాధారణ రుతుపవనాలు !

Apr 10,2024 07:48 #weather report
  • చల్లని కబురందించిన స్కైమెట్‌

న్యూఢిల్లీ : ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడనున్న భారత్‌కు స్కైమెట్‌ చల్లని కబురు తీసుకొచ్చింది. వేసవి ముగియగానే సాధారణ రుతుపవనాలు వచ్చే అవకాశముందని ప్రైవేట్‌ వాతావరణ హెచ్చరికల సంస్థ స్కైమెట్‌ మంగళవారం తెలిపింది. సాధారణం కన్నా అధికంగా ఈసారి వేసవికాలంలో వడగాడ్పులు ఉంటే అవకాశం ఉన్నందున, ఆ తర్వాత కొంత ఊరట లభిస్తుందని అది పేర్కొంది. సాధారణంగా జూన్‌-సెప్టెంబరు వర్షాకాల సీజను. ఈ నాలుగు మాసాల్లో సగటున 868.6 మిల్లిమీటర్ల వర్షపాతం అంటే 102శాతం దాకా వర్షాలు కురిసే అవకాశముందని భావిస్తున్నట్లు స్కైమెట్‌ తెలిపింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య దేశంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు నుండి 8 రోజుల పాటు వడగాడ్పులు వీయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, ఈ సారి అది 10 నుండి 20 రోజుల దాకా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. భారతదేశంలో సాగు నీటి వసతి లేని దాదాపు సగం వ్యవసాయ భూముల్లో వరి, జొన్న, చెరకు, పత్తి, సోయా బీన్స్‌ వంటి పంటలు ఏటా జూన్‌ నుండి సెప్టెంబరు మధ్య వర్షాలపైనే ప్రధానంగా ఆధారపడతాయి. ”ఎల్‌నినో చాలా వేగంగా లా నినాకు మారుతుందని, లా నినా సంవత్సరాల్లో రుతుపవనాల కదలిక చాలా బలంగా వుంటుందని స్కైమెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జతిన్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ, పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఈసారి తగిన మోతాదులో మంచి వర్షాలు పడతాయని స్కైమెట్‌ అంచనా వేసింది. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉత్తర భారత దేశ ధాన్యాగారంగా ప్రసిద్ధిగాంచాయి.

➡️