రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమేనని ఎన్‌టిఆర్‌ నిరూపించారు : చంద్రబాబు

అమరావతి : రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమేనని ఎన్‌టిఆర్‌ నిరూపించారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని … కార్యకర్తలు, నేతలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్‌ నిరూపించారని కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్‌, జ్యోతిబా ఫులే వంటి మహనీయుల స్ఫూర్తితో 1982లో ఇదే రోజున ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రకటించారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా టిడిపి కఅషి చేస్తోందని అన్నారు. ఇక ముందూ ఇదే అంకితభావంతో బంగారు భవిష్యత్తు కోసం కఅషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా అని పేర్కొన్నారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అన్న ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం కదిరిలో నిర్వహించిన టిడిపి ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గన్నారు. ఉండవల్లిలో టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన కుమార్తె, చంద్రబాబు భార్య భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

➡️