ఏడాదికి లక్ష ‘ఉల్లంఘనలు’

Mar 7,2024 09:06 #Human Rights, #KVPS

మానవ హక్కులకు విఘాతంపై ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ఆందోళన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏడాదికి దాదాపు లక్ష కేసులు నమోదవుతు న్నాయని, వాటన్నింటినీ విచారించి, త్వరితగతిన బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా వెల్లడించారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన పెండింగ్‌ కేసులను విచారించేందుకు బుధవారం విజయవాడలోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బహిరంగ విచారణ, అధికారులతో క్యాంప్‌ సిట్టింగ్‌ నిర్వహించింది. డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ అధికారులు, ఎన్‌జిఒలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానవ హక్కుల ఉల్లంఘనలు, వాటికి సంబంధించి నమోదైన కేసులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నివేదికను అందజేయాల్సిందిగా కమిషన్‌ ఆదేశించింది. అలాగే వెట్టిచాకిరి, లారీ డ్రైవర్ల ఇబ్బందులు, ఆహార భద్రత, జైళ్లలో నేరస్తుల ఆత్మహత్యలు, తదితర మానవ హక్కుల ఉల్లంఘనలపైనా నివేదికలను త్వరితగతిన సమర్పించాలని అధికారులకు కమిషన్‌ స్పష్టం చేసింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం రోజుకు సుమారు 400 మానవ హక్కుల ఉల్లంఘనల కేసులు నమోదవుతున్నాయని, వాటన్నింటినీ జాతీయ, రాష్ట్ర కమిషన్‌లు విచారించి, బాధితులకు తగు న్యాయం చేస్తున్నాయని తెలిపారు. గతేడాదికి సంబంధించి ఆరువేల కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ‘మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రభుత్వానికి, అధికారులకు, ఎన్‌జిఓలకు అవగాహన కల్పించి, సత్వరమే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఈ క్యాంప్‌ సిట్టింగ్‌, బహిరంగ విచారణ చేపడుతున్నాం. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంచి సత్ఫలితాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 30 పెండింగ్‌ కేసులు కమిషన్‌ ముందుకు విచారణకు రాగా, వాటిలో 17 కేసుల్లో తుది తీర్పు వెల్లడించాం. ఈ మొత్తం కేసుల్లో బాధితులకు రూ.80 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలి చ్చాం’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక దళితున్ని హతమార్చి డోర్‌ డెలివరీ చేసిన కేసుపై మీడియా ప్రశ్నించగా.. ఆ కేసు తమ జాబితాలో లేదని, ఒక వేళ పెండింగ్‌లో ఉంటే పరిశీలిస్తామని ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి కమిషన్‌ సభ్యులు రాజీవ్‌ జైన్‌, డిఎమ్‌ మూలే, విజయభారతి సయానీ, రిజిస్ట్రార్‌ సూరజ్‌ దే, అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

  • రాష్ట్రంలో కమిషన్‌కు శాశ్వత భవనం ఏర్పాటు చేయండి : కెవిపిఎస్‌ వినతి

ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్‌కు శాశ్వత భవనం NRఏర్పాటు చేయాలని కెవిపిఎస్‌ కోరింది. విజయవాడ వచ్చిన మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాను కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ పూర్తిస్థాయిలో పనిచేయటం లేదని, కనీసం ఫిర్యాదులు స్వీకరించేందుకు కూడా ఇక్కడ యంత్రాంగం లేదని మాల్యాద్రి పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన సిబ్బందిని తెలంగాణ నుంచి తీసుకొచ్చేందుకు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని తెలియజేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ వద్ద వేలాది ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయని, వెంటనే వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ పదవీకాలం ఈ నెల 23న పూర్తవుతుందని, వెంటనే ఈ పదవిని భర్తీ చేయాలని కోరారు. వీటితోపాటు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల అంశాన్ని కూడా మాల్యాద్రి ఛైర్మన్‌ దృష్టికి తీసు కెళ్లారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న కుల దురహంకారం, హత్యలు, దాడులు, సాంఘిక బహిష్కరణ, తదితర అంశాల గురించి ఆయనకు వివరించారు. కెవిపిఎస్‌ పలుమార్లు దళిత సమస్యలపై పంపిన అర్జీలపై తీసుకున్న చర్యలపై కూడా సమాచారం ఇవ్వాలని మాల్యాద్రి కోరారు. ఆయనతోపాటు కెవిపిఎస్‌ సహాయ కార్యదర్శి జి నటరాజ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్‌ ఉన్నారు.

➡️