జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఆన్‌లైన్‌ నమోదుకు వారం గడువు

Feb 19,2024 15:27 #house, #journalists
  • నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌(కృష్ణా) : వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి (19 ఫిబ్రవరి, 2024) నుండి 26 ఫిబ్రవరి, 2024 (సోమవారం) వరకు అర్హులైన జర్నలిస్టుల నుండి వెబ్‌ సైట్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే 6 జనవరి, 2024 వరకు అంటే నిర్ణీత గడువులోగా ఆన్‌ లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోని వారికి, నమోదు చేసుకున్నప్పటికీ సబ్మిట్‌ కొట్టని వారికి ఆయా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయి ఉంటే వారంతా www.ipr.ap.gov.in వెబ్‌ సైట్‌ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే జర్నలిస్టుల దరఖాస్తుల వెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

➡️