కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌.. 1313 వాహనాల సీజ్‌

May 24,2024 20:20 #cordon search, #police

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి చేపట్టిన కార్డన్‌ సెర్చ్‌ శుక్రవారం కూడా కొనసాగింది. 276 ప్రాంతాల్లో చేపట్టిన కార్డన్‌ సెర్చ్‌లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 1,313 వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. అనుమానాస్పదంగా వున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 24 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేశారు. మరో ఎనిమిది మందికి 41ఎ నోటీసులు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యంపై దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు నాటుసారా తయారీకి ఉపయోగించే ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ వుంచిన నాలుగు వేల లీటర్ల డీజిల్‌ను సీజ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకారం అందించాలని డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా ఈ మేరకు ఒక ప్రకటనలో కోరారు. ఎక్కడైనా.. ఎవరైనా.. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే 112, 100 నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

➡️