ప్రపంచంలో మన పిల్లలు నెంబర్‌ 1 కావాలి : సిఎం జగన్‌

Dec 22,2023 09:04 #ap cm jagan, #Children, #world
  • విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- పాడేరు టౌన్‌, చింతపల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) : ‘మన పిల్లలు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా ఎదగాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్‌ ప్రీ లోడెడ్‌ ట్యాబ్‌ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సిఎం లాంఛనంగా ప్రారంభించారు. 620 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 4,34,185 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందించనున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ట్యాబుల పంపిణీ గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుందన్నారు. డిజిటల్‌ విప్లవంలో భాగంగా గతేడాది కూడా తన పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను పిల్లలకు, ఉపాధ్యాయులకు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ట్యాబ్‌లు మరమ్మతులకు గురైతే తామే వారం రోజుల్లో రిపేర్‌ చేసి ఇస్తామన్నారు. రూ.33 వేలు ఖరీదు చేసే ట్యాబ్‌, కంటెంట్‌ను తమ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని తెలిపారు.ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌ (ఐఎఫ్‌పి) ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న పదేళ్ల నుదృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకువస్తున్నామని, కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి నుంచి ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్టును ప్రవేశపెడుతున్నామన్నారు. 15,715 స్కూళ్లలో 32,213 క్లాస్‌ రూముల్లో ఇప్పటికే ఐఎఫ్‌పిలు పెట్టి డిజిటలైజ్‌ చేసినట్టు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లీషు ల్యాబ్‌లు తీసుకువచ్చామన్నారు. వాటన్నింటిలోనూ 10,038 స్మార్ట్‌ టివిలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తరగతి గదులన్నీ డిజిటలైజ్‌ అయ్యే కార్యక్రమం జనవరి 30కి పూర్తవుతుందని ప్రకటించారు.

దుర్బిద్ధితోనే బురదజల్లుతున్నారు

దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తున్నామని గిట్టని వారు అంటున్నారని జగన్‌ విమర్శించారు. తాము ప్రతి పైసా మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామన్నారు. ట్యాబ్‌లు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారని కొందరు దుర్బిద్ధితో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, అరకు ఎంపి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం నేతల గృహ నిర్బంధం

సిఎం పర్యటన నేపథ్యంలో సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు సహా పలువురిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. పెదబయలులో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొండా సన్నిబాబును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. చింతపల్లిలో చిన్నయ్యపడాల్‌ను, కొయ్యూరులో సూరిబాబును పోలీసులు నిర్బంధించారు.

➡️