14న తెనాలి రానున్న పవన్‌కల్యాణ్‌

Apr 7,2024 21:20 #paryatana, #pawan kalyan, #Tenali

ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) :జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 14న తెనాలి రానున్నట్లు ఆ పార్టీ పిఎసి చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని బోస్‌రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 14న సాయంత్రం పుర వేదికపై జరిగే బహిరంగ సభలో రాష్ట్రంతో పాటు తెనాలి అభివృద్ధి ప్రణాళికను పవన్‌ వివరిస్తారని చెప్పారు. వలంటీర్లను అడ్డుపెట్టుకొని వైసిపి లాభించే కుట్రలు పన్నుతుందని, వృద్ధులు, వికలాంగులకు చెల్లించే పెన్షన్ల విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పనిచేస్తుందని తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా వ్యవస్థలను బాగు చేస్తుంది గాని వైసిపి ప్రభుత్వం మాదిరిగా దిగజార్చదని అన్నారు. సలహాదారుల పేరిట పార్టీ వైసిపి మద్దతుదారులకు పదవులు కట్టబెట్టి కొట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం వలంటీర్లకు మాత్రం రూ.ఐదు వేలతో సరిపెడుతోందన్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వలంటీర్లను కొనసాగించి వారికి గౌరవప్రదమైన వేతనం ఇస్తామని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.

➡️