ఫ్యాన్‌ను విసిరేసేందుకు జనం సిద్ధం : టిడిపి అధినేత చంద్రబాబు

Feb 19,2024 20:05 #Chandrababu Naidu, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ను విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీల వీడియో విడుదల చేసి, వీటిపై చర్చకు సిద్ధమా అంటూ సోమవారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. జగన్‌కు, ఆయన ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, ఇంకా 50 రోజులే ఉందని తెలిపారు. ‘సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి, బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు’ అని జగన్‌ను ప్రశ్నించారు. బూటకపు ప్రసంగాలు కాదని, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామని పేర్కొన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్‌ విసిరారు. ప్రాంతం, సమయం చెబితే ఎక్కడికైనా వస్తానని, దేనిమీదైనా చర్చించేందుకు సిద్ధమా? అని జగన్‌ను ప్రశ్నించారు.

➡️