లౌకికతత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఐక్యమవ్వాలి

Mar 4,2024 10:25 #Secular Forum

సెక్యులర్‌ ఫోరం సదస్సులో వక్తల పిలుపు

ప్రజాశక్తి- కర్నూలు : కార్పొరేషన్‌దేశంలో మతోన్మాదులను ఓడించడానికి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కులమతాలకతీతంగా ఐక్యమై ముందుకు రావాలని సెక్యులర్‌ ఫోరం సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. ‘లౌకిక తత్వాన్ని కాపాడుకుందాం – మతోన్మాదులను ఓడిద్దాం’ అనే అంశంపై కర్నూలు సెక్యులర్‌ ఫోరం ఆధ్వర్యాన ఈడెన్‌ గార్డెన్‌లో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా శ్రీ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, జయహో జాతీయ అధ్యక్షులు విజయశంకర్‌ స్వామీజీ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర పోరాటంలోనే బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి ఐక్యంగా పోరాడారని, దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్య సమాజ్‌ సభ్యుడైన రాంప్రసాద్‌ బిస్మిల్‌, సంప్రదాయ ముస్లిం మతస్తుడైన అష్ఫాకుల్లా ఖాన్‌ అని గుర్తు చేశారు. వారిద్దరూ స్వతంత్ర పోరాటం కోసం ఉరికంభాన్ని ఎక్కిన మహానీయులని కొనియాడారు.

అలాంటి మహావీరులు తెచ్చిపెట్టిన స్వాతంత్ర దేశంలో నేడు పాలిస్తున్న పాలకులకు స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేదని తెలిపారు. రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక దేశంగా పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పాలకులు వాటికి తిలోధకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మన్సూర్‌ రహ్మాన్‌ మాట్లాడుతూ.. నేటి పాలకులు భారతదేశ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియకుండా చేస్తున్నారన్నారు. స్వాతంత్ర పోరాటంలో ముస్లిముల పాత్ర చాలా కీలకమైందని తెలిపారు. బిజెపి పాలనలో ముస్లిం చక్రవర్తులను విలన్లుగా చూపించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంఎ.గఫూర్‌ మాట్లాడుతూ పదేళ్లు దేశాన్ని పాలించిన బిజెపి వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లోనూ 370 సీట్లు సాధించి మనువాద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకుంటుందన్నారు. అదే జరిగితే భారతదేశంలో మైనార్టీ ప్రజలందరూ రెండవ తరగతి పౌరులుగా జీవించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నా రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించకపోవడం దారుణమన్నారు. భారత రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. కుల, మతాలకతీతంగా ప్రజలు ఐక్యమై పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అబ్దుల్‌ జబ్బర్‌ మౌలానా, మునిర్‌ అహమ్మద్‌, ఆవాజ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ఎ.సుభాన్‌, నగర అధ్యక్షులు ఎగ్బాల్‌ హుస్సేన్‌, సెక్యులర్‌ ఫోరం నగర నాయకులు నాసిర్‌, సివిల్‌ ఫోరం కన్వీనర్‌ ప్రసాద్‌ శర్మ, గౌస్‌ దేశారు తదితరులు పాల్గొన్నారు.

➡️