మైనింగ్‌ డైరెక్టరుగా వెంకటరెడ్డి నియామకంపై పిల్‌

Feb 15,2024 09:23 #Illegal mining
PIL on the appointment of Venkata Reddy as Director of Mining

ప్రజాశక్తి-అమరావతి : గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌లో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. డైరెక్టరు పోస్టులో ఆయనను ఎలా నియమించారో వివరిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీతోపాటు గనులశాఖ డైరెక్టరు వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు తిలోదకాలిచ్చి వెంకటరెడ్డిని సంచాలకుడిగా నియమిస్తూ జిఓ ఇచ్చారంటూ టి గంగాధర్‌ అనే వ్యక్తి పిల్‌ తరఫున న్యాయవాది చుక్కపల్లి భానుప్రసాద్‌ వాదించారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌గా చేసే వెంకట్‌రెడ్డిని పాఠశాల విద్యాశాఖలోకి తెచ్చి తర్వాత మైనింగ్‌ సంచాలకులుగా నియమించడం చట్ట వ్యతిరేకమన్నారు. గనులశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా కనీసం రెండేళ్లు చేయాలన్న నిబంధనకు వ్యతిరేకమన్నారు. వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులిచ్చిన హైకోర్టు విచారణను మార్చి 27కు వాయిదా వేసింది.

➡️