ఫామ్‌-26 తెలుగులో ఉండాలని పిల్‌

Apr 2,2024 23:36 #Form-26, #pil, #should be in Telugu

ప్రజాశక్తి-అమరావతి :ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్‌ తెలుగులో ఉండాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. అభ్యర్థుల ఆస్తులు, కేసులకు చెందిన అఫిడవిట్‌ (ఫామ్‌-26)ను తెలుగులో కూడా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులివ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా మాచవరానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు, తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు సామల రమేష్‌ బాబు పిల్‌ దాఖలు చేశారు. ఇప్పటికే తమిళనాడులో తమిళంలో ఫారం ఉంటుందన్నారు. ఇసికి వినతిపత్రం ఇస్తే ఫలితం లేదన్నారు. హైకోర్టు ఇవ్వబోయే తీర్పునకు అనుగుణంగా అభ్యర్థులు తమ ఆస్తులు, కేసుల వివరాలు తెలుగులో ఉండేలా చేయాలన్నారు. ఫామ్‌-26 ఇంగ్లీష్‌లో ఉంటోందన్నారు. దీనివల్ల అభ్యర్థుల వివరాలు ప్రజలకు తెలియడం లేదన్నారు.
వలంటీర్ల ద్వారా పింఛన్లు చెల్లించాలని పిల్‌
పెన్షన్లను వలంటీర్లు చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. గత నెల 30న ఇసి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి, మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌పై బుధవారం విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది.
వివేకా కుమార్తెకు ఊరట
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సిబిఐ అధికారి రామ్‌సింగ్‌పై వివేకా పిఎ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందులలో నమోదైన కేసు విచారణను హైకోర్టు నిలిపేసింది. దర్యాప్తుపై తదుపరి చర్యలన్నింటినీ 4 వారాలపాటు తాత్కాలికంగా నిలిపేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. వివేకా హత్య కేసులో తాము చెప్పినట్లు చేయకపోతే అంతు చూస్తామంటూ వేధిస్తున్నారని కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పులివెందుల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. పులివెందుల కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. దీనిని ఆ ముగ్గురు హైకోర్టులో సవాల్‌ చేశారు. పులివెందుల కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలను నాలుగు వారాల పాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి.

➡️