గిరిజనులపై పోలీసుల దాడి

Apr 16,2024 01:01 #dadi, #Girijana, #police
  • గంజాయి లోడ్‌ చేస్తున్నారని అర్ధరాత్రి ఇంట్లోకి చొరబాటు
  •  ప్రశ్నించిన మహిళపై దురుసు ప్రవర్తన

ప్రజాశక్తి – ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని సుత్తిగూడ గ్రామానికి చెందిన గిరిజనులపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. గంజాయి లోడు చేస్తున్నారన్న అనుమానంతో ఇంట్లో చొరబడి ఓ గిరిజన మహిళతో పాటు నలుగురు గిరిజనులపై స్థానిక ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది దాడికి ఒడిగట్టారు. దీంతో గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. సుత్తిగుడ గ్రామానికి చెందిన గిర్లియా బాలభద్రుడి ఇంట్లోకి అర్ధరాత్రి 11 గంటల సమయంలో స్థానిక ఎస్‌ఐ కె.రవీంద్ర తన సిబ్బందితో వచ్చారు. లారీలో గంజాయి లోడు చేస్తున్నట్లు తమకు సమచారం అందిందని తెలిపి దాడికి తెగబడ్డారు. ‘ ఏ కారణం లేకుండా ఎందుకు నా భర్తను కొడుతున్నారు’ అని అడ్డుకున్న బాలభద్రుని భార్య దేవిపైనా దురుసుగా ప్రవర్తించారు. ఆ క్రమంలో ఆమెను నెట్టివేయగా స్పృహతప్పి కింద పడిపోయారు. బాలభద్రుడు కొన్ని సంవత్సరాలుగా పసుపు వ్యాపారం చేస్తున్నారు. అకారణంగా తనపై జరిగిన దాడి విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు తెలిపారు. ఇదే విషయమై ఎస్‌ఐ కె.రవీంద్రను స్థానిక విలేకరులు వివరణ కోరగా సుత్తిగూడ గ్రామానికి తనిఖీలకు వెళ్లామని, అనుకోకుండా గిరిజనులపై చేయిచేసుకోవడం జరిగిందని తెలిపారు. పోలీసుల దాడిని లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్‌ కె.త్రినాథ్‌ ఓ ప్రకటనలో ఖండించారు. గిరిజన ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు అధికారులే ఇలా దాడులకు పాల్పడటం దారుణమన్నారు.

➡️