రాజకీయ అవినీతే అభివృద్ధికి ఆటంకం

  •  ఉద్యోగుల జీతభత్యాలు పెంచితేనే కొనుగోలు శక్తి పెంపు
  • కార్పొరేట్ల కోసమే భూ టైటిల్‌ యాక్ట్‌
  • ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : రాజకీయ అవినీతి, కార్పొరేట్‌ దోపిడీ అభివృద్ధికి అడ్డుగోడలుగా మారాయని, సామాన్య ప్రజానీకం ఆదాయాలు పెరిగి, భూ పంపిణీ జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఏలూరులో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్రకమిటీ సమావేశాల సందర్భంగా మంగళవారం స్థానిక కాశీవిశ్వేశ్వర కల్యాణ మండపంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా నాయకులు పాల్గన్నారు. ముందుగా ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి మెయిన్‌ గేటు నుంచి ఆర్‌ఆర్‌పేట మీదుగా కాశీవిశ్వేశ్వర కల్యాణ మండపం వరకూ రెడ్‌షర్ట్‌ వలంటీర్ల కవాతు, ప్రదర్శన సాగింది.

అనంతరం జరిగిన సదస్సులో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రూ.కోటి ఖర్చయ్యే రోడ్డుకు రూ.ఐదు కోట్లు కేటాయించి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి దాంట్లోనూ తీవ్రమైన రాజకీయ అవినీతి జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలోకార్పొరేట్లు రూ.లక్షల కోట్లు రుణాలుగా తీసుకుని ఎగ్గొడుతున్నారని, ఇలాంటివి అరికడితే నిజమైన ప్రజాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు జీతాల పెంపు కోసం అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమ్రగశిక్ష ఉద్యోగులు పోరాడుతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీతాలు పెంచడం ద్వారా కొనుగోలు శక్తి పెరిగి అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు జీతాలు పెంచడానికి నిరాకరిస్తుందన్నారు. 60 శాతం మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని, దీన్ని అభివృద్ధి అందామా? అంటూ ప్రశ్నించారు. జిల్లాలో అనేక రకాల భూములు లక్షల ఎకరాలు ఉన్నాయని, కుటుంబానికి 2.50 ఎకరాలు పంపిణీ చేస్తే అభివృద్ది జరుగుతుందని తెలిపారు. మనది ప్రజాప్రణాళిక, ప్రజల అభివృద్ధి అని, పాలకులది మాత్రం ఓట్ల ప్రణాళిక, కార్పొరేట్ల అభివృద్ధి అని అన్నారు. సాగునీటి వనరులను అభివృద్ధి చేయడం, వ్యవసాయ పంటలకు ధరలు కల్పిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఫోన్‌పే మాదిరిగా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు భూమిని ఆగమేఘాల మీద కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా, ధరలు అదుపు చేయకుండా మోడీ ప్రభుత్వం పిడికెడు అక్షింతలు ఇస్తుందన్నారు.

మతవిశ్వాసాలను పెంచుతూ అయోధ్యకు రావాలంటూ పిలుపు ఇస్తోందని విమర్శించారు. కమ్యూనిస్టులు తోకపార్టీలు అనేవారని, ఇప్పుడు బిజెపికి టిడిపి, వైసిపి, జనసేన తోక పార్టీలుగా మారాయన్నారు. కమ్యూనిస్టుల పేరు చెబితే ప్రభుత్వం భయపడుతుందని, మనం ప్రతిపక్షం కాదని, ప్రజాపక్షం అని తెలిపారు. ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదని, ఎయిడెడ్‌ కాలేజీలను మూసేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులకు దాదాపు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని, నాలుగున్నరేళ్లలో ఒక్క డిఎస్‌సి కూడా తీయలేదని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి జరగాలంటే చింతలపూడి, తాడిపూడి వంటి ఎత్తిపోతల పథకాలు పూర్తిచేసి నీటివనరులను పెంచాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రభుత్వానికి సరైన పాలసీ లేదని విమర్శించారు. జిల్లాలో దళితులు, ఆదివాసీలు 25 శాతం జనాభా ఉన్నారని, వీరంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన ఏజెండా కావాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ వందన సమర్పణ చేశారు.

➡️