కార్పొరేట్లకు లాభాలు.. సామాన్యులకు భారాలు

  • బిజెపి హయాంలో జరుగుతున్నదిదే..
  •  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు
  •  ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని పిలుపు

ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : బిజెపి హయాంలో దేశ సంపద కార్పొరేట్ల పరమవుతోందని, ప్రజలపై పన్నులు, ధరల భారాలు విపరీతమవుతున్నాయని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. అదానీ, అంబానీ వంటివారిని మరింత కోటీశ్వరులను చేస్తూ, ప్రజలకు ద్రోహం చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందని తెలిపారు. రైతాంగం, కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చివేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ గిరిజనుల భూములను వివిధ ప్రాజెక్టుల పేరిట కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని తెలిపారు. దీనిని నిలువరించకపోతే గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వివరించారు. రాజ్యాంగ విలువలకు బిజెపి సర్కారు తిలోదకాలిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రజలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనన్నారు. బిజెపితో జతకట్టిన టిడిపి కూటమిని, మోడీకి అన్ని రకాలుగా సహకరిస్తున్న వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు, ప్రజాస్వామ్య విలువలకు అండగా నిలబడే సిపిఎం అరకు ఎంపి అభ్యర్థి పి అప్పలనర్సను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై, కాంగ్రెస్‌ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి శతక బుల్లిబాబును హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వాన్ని కూలదోసి రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఇండియా వేదికను గెలిపించుకోవడం ఎంతో అవసరమని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కె విజయరావు, భారత్‌ బచావో నాయకులు, మాజీ ఐఎఎస్‌ అధికారి శ్రీనివాస్‌, రంగారెడ్డి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ అజశర్మ, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్యపడాల్‌ పాల్గొన్నారు.

➡️