పొగాకు సాగులో యాంత్రీకరణకు ప్రోత్సాహం

Dec 14,2023 10:41 #Tobacco
  • వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డికె.యాదవ్‌
  • సిటిఆర్‌ఐ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు ప్రారంభం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : పొగాకు సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలని వాణిజ్య పంటల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డికె.యాదవ్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సిటిఆర్‌ఐ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఆ సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ ఉత్సవాలను డికె.యాదవ్‌ ప్రారంభించి మాట్లాడారు. పొగాకు నుంచి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు ప్రోత్సహించాలని, పొగాకులో క్యాన్సర్‌ కారకాలను తగ్గించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సూచించారు. రైతులకు అధిక ఆదాయం లభించేందుకు మిరప, పసుపు, అశ్వగంధ, ఆముదం వంటి పంటలపైనా పరిశోధన చేసేందుకు సిటిఆర్‌ఐకు నిర్దేశించామని తెలిపారు. నాణ్యమైన విత్తనాలతోపాటూ మేలైన యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను రూపొందించడానికి శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ మాగంటి శేషు మాధవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపి మార్గాని భరత్‌రామ్‌, పొగాకు బోర్డు చైర్మన్‌ యస్వంత్‌ కుమార్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నన్నయ యూనివర్సిటీ విసి కె.పద్మరాజు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానానికి చిహ్నంగా నిర్మించిన ప్రత్యేక పైలాన్‌ను అతిథులు ఆవిష్కరించారు.ఆదర్శ రైతులను సత్కరించారు. కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

➡️