16న రైతు, కార్మికసంఘాల నిరసనోద్యమానికిసంపూర్ణమద్దతు-సిపిఎం ప్రకటన

Feb 7,2024 09:37

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదిన దేశ వ్యాప్త నిరసనోద్యమానికి రైతు, కార్మిక సంఘాల సంయుక్త వేదికలు ఇచ్చిన పిలుపునకు సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రెండురోజులపాటు విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు చేసిన తీర్మానాన్ని మంగళవారం మీడియాకు విడుదల చేశారు. 2020-21వ సంవత్సరంలో డిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా మద్దతు ధరల చట్టాన్ని తీసుకువస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు రైతుసంఘాలతో చర్చించిన తరువాత పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్రప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన హామీలను ఈ తీర్మానంలో గుర్తుచేశారు. ఆ హామీని అమలుచేయాలని కోరారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనంగా రూ.26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద విధానాలను అమలుచేస్తోందని విమర్శించింది. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని పేర్కొంది. ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని, కనీస వేతనం రూ.600 ఇస్తూ, 200 రోజులు పని కల్పించాలని, పట్టణ పేదలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరింది. రైతులు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులలో లక్ష కోట్లు ఖర్చు చేయకుండా ఖాజానాకు తిరిగి జమ చేసుకుందని విమర్శించింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు అమలు చేయకపోవడంతో, రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పేర్కొంది. లక్షమందికి పైగా రైతులు ఆత్మహత్యలకు బలయ్యారని, కార్పొరేట్‌ కంపెనీలకు రూ.15 లక్షల కోట్లు రాయితీలుగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసేందుకు నిరాకరిస్తోందని పేర్కొంది. ఈ పరిస్థితులల్లో ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా నిరసనోద్యమానికి రైతు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపును సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రజలందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గనాలని, సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

➡️