గిరి పుత్రులకు గుణాత్మక విద్య అందించండి

Mar 13,2024 09:14 #AP Education, #tribal students

ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌
తొలివిడతలో 61మంది సిఆర్‌టిల రెగ్యులరైజేషన్‌
స్కూల్‌ అసిస్టెంట్లుగా నియామక పత్రాలు అందజేత
ప్రజాశక్తి -పాడేరు : గిరిపుత్రులకు గుణాత్మకమైన విద్యను అందించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని ఐటిడిఎ సమావేశ మందిరంలో 61 మంది సిఆర్‌టిలకు రెగ్యులరైజ్‌ చేస్తూ స్కూల్‌ అసిస్టెంట్లుగా నియామక ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ 2023 రెగ్యులరైజేషన్‌ చట్టం 30, జిఒ 114 సమర్ధవంతంగా అమలు చేసి, సిఆర్‌టిలను , రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ చేసిందన్నారు. 16 మంది సిఆర్‌టిలకు రెగ్యులర్‌ చేయడానికి సర్వీసులో కొంత వ్యత్యాసం ఉందని, అందరినీ రెగ్యులర్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రెగ్యులర్‌ అయిన సిఆర్‌టిలు ఎవరికీ ఎటువంటి డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మొదటి విడతలో 61 మందిని రెగ్యులర్‌ చేసామని, రెండవ విడతలో మరో వంద మంది రగ్యులర్‌ అయ్యే అవకాశం ఉందన్నారు. అర్హతల మేరకు అందరినీ రెగ్యులర్‌ చేస్తామన్నారు. రెగ్యులరైన సిఆర్‌టిల వివరాలు నిధి పోర్టల్‌లో పెట్టామన్నారు. నియామక ఉత్తర్వులు పొందిన వారంతా గిరి విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతోపాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేకదృష్టి పెట్టి, ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు పాల్గొన్నారు.

➡️