ఈ నెల 12 వరకు రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

Apr 10,2024 11:44 #hyderabad, #Phone Tapping Case

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని రాధాకిషన్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైలు సూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని తెలిపారు. దీంతో పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో రాధాకిషన్‌రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
రాధాకిషన్‌రావుతో పాటు మాజీ అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులను అరెస్ట్‌ చేశారు. హై ప్రొఫైల్‌ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

➡️