బెదిరించే అధికారులపై చర్యలు తీసుకోవాలి

Jan 11,2024 16:49
ramadevi on anganwadi strike 31day

ప్రజాశక్తి-మంగళగిరి : అంగన్వాడీలను బెదిరించే అధికారులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. మంగళగిరి ఐసిడిఎస్ పరిధిలో సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లను, హెల్పర్లను సూపర్వైజర్లు బెదిరించడాన్ని నిరసిస్తూ గురువారం మంగళగిరి ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 31 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. సూపర్వైజర్ల బెదిరింపులు, మహిళా పోలీసులు నోటీసులు అందజేసే విధానం, ఉద్యోగాలు తీసేస్తామని చెప్పడం ఈ చర్యలకు నిరసనగా అంబేద్కర్ సెంటర్లో గల నిరవధిక సమ్మె శిబిరం నుండి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ కొన్ని చోట్ల సిడిపిఓ, సూపర్వైజర్లు అంగన్వాడీలను బెదిరింపు మాటలు మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆందోళన చేస్తుంటే అంగన్వాడీల పట్ల ప్రభుత్వ విధానం నిరంకుశంగా ఉందని అన్నారు. ఎస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమని అన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్మా చట్టాన్ని అమలు చేసిన అన్ని ప్రభుత్వాలను ఉద్యోగులు ఇంటికి పంపించారని అన్నారు. అంగన్వాడీలు లక్ష కుటుంబాలు ఉంటే వారికి అండగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయని అన్నారు. కోటి సంతకాలు సేకరించి మహిళల సంక్షేమ అధికారికి వినతిపత్రం అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీలు రోజు సమ్మె శిబిరంలో పాల్గొనే కంటే తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అంగన్వాడీలు చెబుతున్నారని అన్నారు. వీరికి తోడు కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, అందరూ ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం దిగివస్తుందని అన్నారు. సారా ఉద్యమం కూడా మహిళలు చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉందని అన్నారు. కనీస వేతనం అమలు చేయమని అంగన్వాడీలు కోరుతుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ 31 రోజులుగా తమ న్యాయమైన కోరికలను పరిష్కరించమని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమైన అన్నారు. ఆ చట్టం అంగన్వాడీలకు వర్తించదని అన్నారు. అంగన్వాడీలకు షోకాస్ నోటీసులు ఇచ్చే సూపర్వైజర్లు బెదిరింపులు చేస్తున్నారని విమర్శించారు. ఈ విధంగానే బెదిరింపులు చేస్తే రానున్న రోజుల్లో వాళ్ళ ఇళ్ళ ముందు ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరించారు. బెదిరింపులు చేసిన అధికారులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా నాయకులు వేముల దుర్గారావు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తున్నారని, కష్టపడి చేసిన పని చేసే అంగన్వాడీలకు వేతనాలు పెంచమంటే పెంచడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఏసీ డీవో సరళాకు వినతిపత్రం అందజేశారు. బెదిరింపు చేసిన సూపర్వైజర్లు గురించి తనకు తెలియదని, అలా చేసిన వారి పట్ల పై అధికారులకు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వై కమలాకర్, బి వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు టి వెంకటయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు హేమలత, మేరీ రోజమ్మ, సుజాత, ఫాతిమా, భూలక్ష్మి, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ధర్నాలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న మాసపత్రిక ఈనెల పత్రికను చైతన్య మానవి పుస్తకాన్ని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి ఆవిష్కరించారు.

➡️