వేగవంతంగా విమానాశ్రయాల విస్తరణ

వెయ్యేళ్ల చరిత్ర గల రాజమహేంద్రవరం దేశానికే తలమానికం

టెర్మినల్‌ భవన నిర్మాణ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి దేశంలో విమానయాన రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగానే మధురపూడి ఎయిర్‌పోర్టులో రూ.347 కోట్లతో టెర్మినల్‌ భవనం విస్తరణకు శ్రీకారం చుట్టామని కేంద్ర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మధురపూడి విమానాశ్రయంలో టెర్మినల్‌ భవన విస్తరణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెయ్యేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న రాజమహేంద్రవరం నగర సాంస్కృతిక వారసత్వం దేశానికే తలమానికమన్నారు. 2014 నాటికి దేశంలో 74 ఎయిర్‌ పోర్టులు ఉండగా, ఈ తొమ్మిదిన్నరేళ్లలో కొత్తగా మరో 75 ఎయిర్‌ పోర్టులు వచ్చాయన్నారు. దీంతో దేశంలో ఎయిర్‌ పోర్టుల సంఖ్య 149కి చేరిందని తెలిపారు. రానున్న కాలంలో వీటి సంఖ్య 220కి పెంచుతాన్నారు. ప్రస్తుతం మధురపూడిలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ పాయింట్‌ 21.94 వేల చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుందన్నారు. రద్దీ వేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం 18 సర్వీసులు నడుపుతున్నామని, రానున్న రోజుల్లో 25 వరకు సర్వీసులను పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ఎంపి మార్గాని భరత్‌రామ్‌, ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ సంజీవ్‌ కుమార్‌, కలెక్టర్‌ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

➡️