పెట్రేగిన ఎర్రచందనం స్మగ్లర్లు

Feb 6,2024 20:30 #Annamayya district, #redsandel

– కానిస్టేబుల్‌ను వాహనంతో ఢకొీట్టి చంపిన దుండగులు

– రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

– ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

ప్రజాశక్తి – పీలేరు (అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పెట్రేగిపోయారు. ఎపిఎస్‌పి 14వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ బి.గణేష్‌(40)ను వాహనంతో ఢకొీట్టి చంపారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కంభంవారిపల్లె మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సమాచారం అందింది. సుండుపల్లె సరిహద్దు గొల్లపల్లె వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని సిబ్బంది, కానిస్టేబుల్‌ గణేష్‌ ఆపేందుకు ప్రయత్నించారు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు గణేష్‌ను ఢకొీట్టి వేగంగా ముందుకు వెళ్లి పల్లపు ప్రాంతంలో ఆగిపోయారు. కారులో నుంచి దూకి డ్రైవర్‌ సహా ముగ్గురు పారిపోగా, ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. వీరిని తమిళనాడు వాసులుగా గుర్తించారు. ఏడు దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన గణేష్‌ను పీలేరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమారులు దేహాన్ష్‌, రాజ్‌ కిషోర్‌ ఉన్నారు. గణేష్‌ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం గుంటకింద పల్లె. బుధవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వంగణేష్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కానిస్టేబుల్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇస్తామని టాస్క్‌ఫోర్స్‌ డిఐజి శ్రీనివాస్‌ తెలిపారు.

➡️