ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.203 కోట్లు విడుదల

May 22,2024 21:50 #Arogyasree, #Pending Dues, #release

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేసింది. గడిచిన కొన్ని నెలల నుంచి పెండింగ్‌ బకాయిలు విడుదల చేయకపోవటంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ సంఘం అల్టిమేటం జారీ చేయటంతో అలెర్టయిన ప్రభుత్వం రూ.203 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ.1500 కోట్లు పైబడి బకాయిలున్నట్లు నెట్‌వర్క్‌ ఆస్పత్రులు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పెండింగ్‌ బకాయిల్లో కొంత శాతాన్ని ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సిఇఒ లక్ష్మీశా బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా లకీëశా మాట్లాడుతూ.. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌, ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆరోగ్యశ్రీ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 చికిత్సలకు అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్సను ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి కుటుంబానికీ వార్షిక చికిత్స పరిమితిని రూ.25 లక్షల వరకు అందిస్తున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద 42,91,254 మంది లబ్ధిదారులకు రూ.13,470.89 కోట్ల నగదు రహిత చికిత్సను అందించామని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.356 కోట్లను నెట్వర్క్‌ ఆస్పత్రులకు జమచేశామని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఇప్పటి వరకు రూ.366 కోట్లు జమ చేశామని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు, సేవలకు అంతరాయం కలిగించే ఆస్పత్రులపై తగిన చర్యలు తీసుకుంటామని, పేద ప్రజలకు అత్యవసర సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చిందని ఆయన వివరించారు.

➡️