తాగునీటి చెరువులకు నీటిని విడుదల చేయండి

  •  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు చెరువులను, కుంటలను, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నీటితో నింపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు గానూ ఈ నెల 6 నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి, 8 నుంచి నాగార్జునసాగర్‌ నుంచి నీటిని కాల్వలకు విడుదల చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం తాగునీటి సమస్య, ఉపాధి హామీ పనులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీ నుంచి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవస్‌ కాలువల ద్వారా ఎన్‌టిఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాలకు, బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాలకు తాగునీటిని విడుదల చేయాలన్నారు. అలాగే నాగార్జున సాగర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈ నెల 8 నుంచి 18 వరకు 10 రోజులపాటు నీటిని విడుదల చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీ, నాగార్జునసాగర్‌ నుంచి విడుదలయ్యే నీరు ఇతర అవసరాలకు మళ్లకుండా కేవలం తాగునీటి అవసరాలకు వినియోగించేలా చూడాలన్నారు. ఇందుకోసం అన్ని కాలువలపై నిఘా పెంచాలన్నారు. అలాగే తీవ్ర కొరత గల ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు.

పది గంటల్లోపు ‘ఉపాధి’ పనులు ముగించాలి
ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పథకం పనులు ఉదయం పది గంటల్లోపు ముగించాలని సిఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. పనులకు వచ్చే కూలీలంతా తాగునీటిని వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధి పనులు నిర్వహించే ప్రాంతాల్లో కూలీలకు తగిన వసతి, మెడికల్‌ కిట్లను వుంచాలన్నారు. సమావేశంలో జలవనరులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌శాఖ కమిషనరు కె కన్నబాబు, జలవనరులశాఖ ఇఎన్‌సి కె నారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ సిఇ గాయత్రి, భూగర్భ జలవనరులశాఖ డైరెక్టరు జాన్‌ సత్యరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️