417 మంది వలంటీర్ల రాజీనామా

Apr 4,2024 21:07 #resignation, #volunteers

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో 417 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో, సచివాలయాల్లో అందజేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సేవ చేసే తమ పట్ల ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేయడంతో మనస్తాపం చెంది రాజీనామాలకు చేస్తున్నట్లు వలంటీర్లు తెలిపారు. దీనికితోడు ఎన్నికల కమిషన్‌ కూడా విధులకు దూరం పెట్టడంతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. పల్నాడు జిల్లాలో 59 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో 30 మంది, ధూళిపాళ్లలో 19, బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 10 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. జగన్‌కు తోడుగా నడిచేందుకు కొంతమంది, వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది రాజీనామా చేసినట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో 290 మంది వలంటీర్లు మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుకు రాజీనామాలను అందజేశారు. దేవరాపల్లి మండలం బి.కింతాడ గ్రామ సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13 మంది తమ రాజీమానా పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలో 21 మంది వలంటీర్లు రాజీనామా లేఖలను గ్రామ కార్యదర్శికి అందించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలోని వల్లాపల్లి గ్రామ సచివాలయ పరిధిలో 10 మంది వలంటీర్లు తమ రాజీనామా పత్రాలను సచివాలయం అడ్మిన్‌ సెక్రటరీకి అందజేశారు. నెల్లూరు జిల్లా కావలిలో 13 మంది వలంటీర్లు తమ రాజీనామాలను పురపాలక సంఘం కమిషనర్‌ జి.శ్రావణ్‌ కుమార్‌కు, కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఐదుగురు, మదికెర మండలంలో ఆరుగురు వలంటీర్లు తమ రాజీనామాలను ఎంపిడిఒలకు అందజేశారు.

➡️