కొనసాగుతున్న వలంటీర్ల రాజీనామాల పర్వం

ప్రజాశక్తి-యంత్రాంగం : వలంటీర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 848 మంది వలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో, సచివాలయాల్లో అందజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని మునగపాక, తిమ్మరాజుపేట, చెర్లోపాలెం, పాటిపల్లి, అరబుపాలెం, నాగులపల్లి, కాకరపల్లి గ్రామాలకు చెందిన 151 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. రాజీనామా పత్రాలను ఎంపిడిఒ మన్మధరావుకు అందజేశారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బి.సింగవరం గ్రామానికి చెందిన ఐదుగురు, విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో 43 మంది, వేపాడ మండలం వావిలపాడు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న 13 మంది, డెంకాడ మండలం పినతాడివాడ సచివాలయానికి చెందిన 11 మంది వలంటీర్లు తమ రాజీనామా పత్రాలను ఆయా సచివాలయాల్లోని పంచాయతీ సెక్రటరీలకు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా నందిగా మండలంలో 262 మంది, లావేరు మండలంలో 45 మంది, టెక్కలి సచివాలయం-2 పరిధిలో ఒకరు రాజీనామా చేశారు. కర్నూలు జిల్లాలో 11 మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో పని చేస్తున్న 254 మంది వలంటీర్ల రాజీనామా చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సజన ఒక ప్రకటనలో వెల్లడించారు. నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 63 మంది వలంటీర్లు తమ రాజీనామాలను మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేశారు.

➡️