వలంటీర్ల తిరుగుబావుటా

Dec 27,2023 09:50 #Revolt, #volunteers
  • ‘ఆడుదాం ఆంధ్ర’ బహిష్కరణ
  • రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌
  • 28 నుంచి నిరవధిక సమ్మె

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వంపై వలంటీర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, తమను పొరుగు సేవల ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఆందోళన బాట పట్టారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. తమ సర్వీసును క్రమబద్ధీకరణ చేయాలని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మాదిరి తమనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు వలంటీర్లు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చడంలో తాము కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. కరోనా విపత్కర సమయంలో సైతం తాము ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుండి ప్రజలకు సేవలు అందించామని తెలిపారు. ఇన్ని సేవలు చేస్తోన్న తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వలంటీర్లు బహిష్కరించారు.

పట్టణంలోని ఎంజిఎం మైదానం నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కమిషనర్‌ ఛాంబర్‌ ముందు బైఠాయించారు. హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. వైసిపి నాయకులు బెదిరింపులకు పాల్పడినా భయపడకుండా ఆందోళన కొనసాగించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో 35 మంది, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో 35 పంచాయతీలకు చెందిన 314 మంది వలంటీర్లు సమ్మెలోకి వెళ్లారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించారు. పని భారం తగ్గించాలని, పనికితగ్గ వేతనం చెల్లించాలని కోరుతూ ఏలూరు జిల్లా ముదినేపల్లి సచివాలయ పరిధిలోని 32 మంది వలంటీర్లు ఎంపిడిఒ పి.మల్లేశ్వరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయ సిబ్బంది చేయాల్సిన విధులను కూడా తమతో చేయిస్తుండడం సరికాదని తెలిపారు. త్వరలో సమ్మెలోకి వెళ్లనున్నామని ఈ వినతిపత్రంలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాలపల్లి సచివాలయ పరిధిలోని వలంటీర్లు సమ్మె నోటీసును పంచాయతీ కార్యదర్శి కరిముల్లాకు అందజేశారు.

➡️