హక్కులు, విలువలు కాపాడాల్సింది రాజ్యాంగ శక్తులే

-విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి టి రజిని
ప్రజాశక్తి-నెల్లూరు:పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు సంబంధించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న హక్కులను, విలువలను కాపాడాల్సింది రాజ్యాంగ శక్తులేనని విశ్రాంత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి రజని పేర్కొన్నారు. ప్రజా వైద్యులు, కీర్తిశేషులు డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఆదివారం డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యాంగ విలువలు – సవాళ్లు, ఆరోగ్య హక్కు చట్టం-2024 అనే అంశాలపై 16వ స్మారక సదస్సు జరిగింది. డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, యుటిఎఫ్‌, జన విజ్ఞాన వేదిక, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌, ప్రజారోగ్య వేదిక, యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన జస్టిస్‌ రజని మాట్లాడుతూ రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దీనిని అమలుపరిచేవారు మంచివారైతే మంచిగానూ, లేదంటే భిన్నంగానూ ఫలితాలు వస్తాయన్నారు. రాజ్యాంగ హక్కులను సుప్రీంకోర్టు విస్తృతపరిచిందని వివరించారు. అందరికీ కూడు, గుడ్డ, ఆరోగ్యం, విద్య, మంచి పరిసరాలు అందించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. డెత్‌ పెనాల్టీ, స్త్రీలపై వేధింపులు తదితర వాటిలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా శిక్షల విషయంలో జడ్జీలకు స్వేచ్ఛనియాలని, లేదంటే నిబంధనల మేరకు ఏ కొద్దిమందికో రెండేళ్ల శిక్ష పడుతుందని అన్నారు. అన్ని మతాలనూ గౌరవించే లౌకిక రాజ్యాంగం మనదని తెలిపారు.
రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చకూడదన్నారు. ఆరోగ్య హక్కు చట్టం-ఆంధ్రప్రదేశ్‌ 2024 అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య ఉద్యమ సమన్వయకర్త డాక్టర్‌ సుందర్‌ రామన్‌ మాట్లాడుతూ ఆరోగ్యం అనేది ప్రతి పౌరుని ప్రాథమిక హక్కని తెలిపారు. ఆరోగ్యమన్నది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉండాలన్నారు. ఆరోగ్యాన్ని ఆదేశిక సూత్రాల నుంచి ప్రాథమిక హక్కుల్లోకి మార్చాల్చిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1978లో రష్యాలోని అల్మాఆట డిక్లరేషన్‌ ప్రకారం 2000 సంవత్సరం నాటికి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందాలన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజారోగ్య సంరక్షణలో డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్‌గా కీర్తిశేషులు డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ సదస్సుకు డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎంవి.రమణయ్య, జెఎస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చండ్రా రాజగోపాల్‌, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ గేయానంద్‌, జిల్లా అధ్యక్షులు ఉదయ భాస్కర్‌, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, డాక్టర్‌ సూరా రవీంద్ర, ఐలు నాయకులు అంకయ్య, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ నాయకులు పి.మధు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️