సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు 

Jan 1,2024 10:50 #Rajaka Vruti Sangham
rvs demand for sepecial act

 

  • ఎపి రజక వృత్తిదారుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య డిమాండ్‌

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌ : రాష్ట్ర వ్యాప్తంగా రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, రజక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల నివారణకు సామాజిక రక్షణ చట్టం వెంటనే చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎల్‌బిజి భవన్‌లో సంఘం ప్రాంతీయ సదస్సు టంగుటూరి రాము అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భాస్కరయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా సామాజిక సేవ వృత్తి చేస్తోన్న రజకులపై పెత్తందారులు, పెత్తందారీ ప్రజాప్రతినిధుల అనుచరులు దాడులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. రజకులపై అక్రమంగా కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రజక మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రజకుల కోసం సామాజిక రక్షణ చట్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రజకుల సమస్యలను గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర మంత్రులు, బిసి అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, బిసి అభివృద్ధి సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దష్టికి తమ సంఘం తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రజకుల సమస్యల పరిష్కారం, సామాజిక రక్షణ చట్టం సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రజకులతో ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 29న గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామన్నారు. సదస్సులో శ్రీ సాయిరాం జూనియర్‌ కాలేజీ, సాయి వికాస్‌ కోచింగ్‌ సెంటర్‌ కరస్పాండెంట్‌ కె.మోహన్‌రావు, చేతివృత్తుదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ తోట తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

➡️