ఆదివాసీల పొట్ట కొట్టే చట్టాల రద్దుకై పోరాడాలి : రైతు కూలీ సంఘం

ప్రజాశక్తి-మక్కువ : మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని గిరిజన, ఆదివాసీల పొట్ట కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అధిక శాతం కార్పొరేట్లకు మేలు కలిగేలా చట్టాలు తీసుకువస్తున్నారని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఝాన్సీ అన్నారు. శనివారం మన్యం జిల్లా పనసభద్ర పంచాయతీ పరిధిలోని దుగ్గేరులో నూతనంగా నిర్మించిన ఆదివాసి భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ భవనాన్ని పేద ప్రజలందరూ కష్టపడి తమ సొంత ఇంటిలా నిర్మించుకున్నారని ఇది దోపిడీకి గురవుతున్న, ప్రజలది అని ప్రకటించారు. ప్రజలందరూ ఏ చైతన్యంతో అయితే ఈ భవనాన్ని నిర్మించుకున్నారో అదే చైతన్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన అటవీ సంరక్షణ చట్టాలు-2023 వంటి అడవులను నాశనం చేసే చట్టాలనైన అలాగే రైతుల భూములను బడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేటటువంటి చట్టాలునైన ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసి భవన్ నుంచి ర్యాలీగా మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించే జన్ని తిరుపతి వర్ధంతి సభకు వెళ్లారు. ఈ కార్యక్రమము రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వూయక ముత్యాలు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభలో ముందుగా వైజాగ్ లో జరిగిన ఆదివాసి సదస్సు సంచికను, జనం పాటల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వక్తలు తాండ్ర అరుణ దంతులూరి వర్మ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ప్రెసిడెంట్ వి. విజయ, పి. శ్రీను నాయుడు, ఎం. భాస్కర్ రావు పి.అసిరి గిరిజన సంఘం నాయకులు ఎమ్. చెంచు చుట్టుపక్కల గ్రామాల పెద్దలు, సాలూరు పార్వతీపురం మండలాలకు చెందిన ప్రజా సంఘం నాయకులు పాల్గొన్నారు. కళాకారులు ఆద్యంతం పాటలు కళారూపాలు కింద్రి డప్పుల డాన్స్ వంటి వాటితో అలరించారు. చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️