సంధ్య ఆక్వా బస్సులో తనిఖీలు

Mar 24,2024 20:55 #aqua, #drugs case, #Kakinada, #sandya

– ఫైల్స్‌, కంప్యూటర్‌, పరికరాలు స్వాధీనం
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా)
విశాఖపట్నంలో ఇటీవల భారీగా డ్రగ్స్‌ దొరకడంతో రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. డ్రగ్స్‌ కేసులో సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఆ పరిశ్రమలో సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వాలో కూడా రెండు రోజులపాటు సిబిఐ అధికారులు దాడులు నిర్వహించి వెళ్లారు. ఈ నేపథ్యంలో కొత్త మూలపేట ఎస్‌ఇజెడ్‌ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు నాలుగు రోజులుగా నిలిపి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు ఆదివారం సమాచారం ఇచ్చారు. పోలీసులు బస్సు ఉన్న ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. బస్సులో రికార్డులు, కంప్యూటర్‌ పరికరాలు, ఫైల్స్‌, కొత్త చెక్‌ బుక్స్‌, మిషనరీ సామగ్రి ఉన్నట్లు గుర్తించి వాటని స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్‌ చేశారు. ఎస్‌ఐ స్వామి నాయుడు మాట్లాడుతూ కాకినాడ నుంచి వస్తుండగా బస్సుకు బ్రేక్‌డౌన్‌ అయ్యిందని, కంపెనీ సూపర్‌వైజర్‌ మహేష్‌ అదే గ్రామంలో నివసిస్తుండడంతో బస్సును ఇక్కడ నిలిపినట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

➡️