మహిళపై అమానుషానికి పాల్పడిన సంగారెడ్డి యువకులు అరెస్టు

మూసాపేట (హైదరాబాద్‌) : మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని మహిళ (45) పై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి పరారైన ఘటన విదితమే. రక్తస్రావంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. ఈ అమానుషానికి పాల్పడిన యువకులు సంగారెడ్డికి చెందినవారుగా పోలీసుల విచారణలో తేలింది. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు ఉపయోగించిన బైక్‌ను గుర్తించి దర్యాప్తు చేపట్టడంతో వారి ఆచూకీ లభించింది. ఆ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఆ ఇద్దరు యువకులు సంగారెడ్డిలోనే ఉన్న ఓ బార్‌లో పనిచేస్తారని తేలింది. బార్‌లో అర్ధరాత్రి వరకు పనిచేసినవారు బాగా మద్యం తాగి బైక్‌ పై వైజంక్షన్‌ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. ఆమె మూసాపేటలో ఉండేదని, ఆరు నెలల క్రితం వరకు ఓ వాహన షోరూంలో స్వీపర్‌గా పని చేసేదని తెలిసింది. అక్కడ సిబ్బందిని విచారించినా ఆమె చిరునామా తెలియలేదు.

➡️