తాగునీటి కోసం సచివాలయం ముట్టడి

– ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు
ప్రజాశక్తి – పుట్లూరు (అనంతపురం) :అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలోని కంది కాపుల గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆ గ్రామ సచివాలయాన్ని మహిళలు శుక్రవారం ముట్టడించారు. ఖాళీబిందెలతో సచివాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు నుంచి పోలింగ్‌ రోజు వరకు రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా గ్రామానికి తాగునీరు సరఫరా చేశారని, పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి నీటి సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నఫలంగా తాగునీటి సరఫరా ఎందుకు నిలిపివేశారో చెప్పాలని పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిని నిలదీశారు. ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేస్తామని వారికి కార్యదర్శి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ట్యాంకర్‌ ద్వారా ఎప్పటినుంచి నీరు సరఫరా చేస్తారని మహిళలు ప్రశ్నించారు. ఈ రోజు నుంచే నీరు సరఫరా చేయాలని లేకపోతే సచివాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అందుకు పంచాయతీ కార్యదర్శి అంగీకరించడంతో మహిళలు అక్కడి నుంచి వెనుదిరిగారు.

➡️