హైదరాబాద్‌ పబ్లిక్‌ ప్లేసెస్‌, సిటీ పార్కుల్లో షీ టీం నిఘా

తెలంగాణ : హైదరాబాద్‌లోని బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్‌ నిఘా పెట్టాయి. నెక్లెస్‌రోడ్‌, ఇందిరా పార్క్‌, కఅష్ణకాంత్‌పార్క్‌తోపాటు ఇతర పబ్లిక్‌ ప్లేస్‌లలో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన జంటలను శుక్రవారం షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి. 12 మందిని అరెస్టు చేసి ఫైన్‌ వేసి, కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నెక్లెస్‌రోడ్‌తో పాటు ఇతర పార్కుల్లో షీ టీమ్స్‌ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

గతంలో ఇందిరాపార్క్‌ యాజమాన్యం దీన్ని చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా వివాదంగా మారింది. పార్క్‌లోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా, 2021 ఆగస్టులో, పార్క్‌ వెలుపల ‘పెళ్లి కాని జంటలకు అనుమతి లేదు’ అని యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదాస్పదంగా మారడంతో ఆ బోర్డును వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన షీ టీమ్స్‌ రంగంలోకి దిగింది. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్‌ హెచ్చరించింది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఉంటుందని షీ టీం అధికారులు వెల్లడించారు.

➡️