రైతుల ప్రాణాలు తీస్తున్న బిజెపిని గద్దెదించండి

 ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభోత్సవంలో శ్రీనివాసరావు

విజయవాడ సెంట్రల్‌లో బాబూరావు పాదయాత్ర

ప్రజాశక్తి – అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) :    కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులపైనా విరుచుకుపడి ప్రాణాలు తీస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. వారం రోజులపాటు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సాగే ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్రను గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా హర్యానాలో పోలీసుల రబ్బరు తూటాలకు మరణించిన యువరైతు శుభకరణ్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాల్లోకి బెలూన్లను ఎగురవేసి జన శంఖారావాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దళితులు, మైనార్టీలను కేంద్ర ప్రభుత్వం వివక్షకు గురిచేస్తూ వారిపై దాడులకు పూనుకుంటోందన్నారు.

పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్న రైతులపై పోలీసు బలగాలను ప్రయోగించి ప్రాణాలు తీస్తోందన్నారు. దేశానికి, రైతులకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం చేస్తోన్న బిజెపికి అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. అభివృద్ధి పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడు అభివృద్ధి ఊసే ఎత్తడం లేదని, మతతత్వం, అయోధ్య రామాలయం చుట్టూ ప్రజలను తిప్పుతున్నారని విమర్శించారు. చివరికి దైవాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. మరోపక్క ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి గురించి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నోరు మెదపడం లేదన్నారు. దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచించిన బిజెపి, వైసిపిలను గద్దెదించాలని, నిరంకుశ బిజెపితో జతకట్టుతున్న టిడిపి, జనసేన కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం, వామపక్షాలను, లౌకిక శక్తులను బలపరచాలని కోరారు.

పాదయాత్రకు నేతృత్వం వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ.. అధికారం వెలగబెట్టిన ప్రజాప్రతినిధులు నగరాన్ని అభివృద్ధి చేయకపోగా, సొంత ఆస్తులను అభివృద్ధి చేసుకున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి, బిజెపి, వైసిపి పాలనలో నగరం నిర్లక్ష్యానికి గురైందన్నారు. కమ్యూనిస్టుల హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందని చెప్పారు. అందుకే రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. బిజెపి చేతిలో వైసిపి, టిడిపి, జనసేనలు కీలుబొమ్మలని విమర్శించారు. నిత్యం ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాడే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కె.శ్రీదేవి, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితరులు పాల్గన్నారు.

➡️