మా సమస్యలు పరిష్కరించండి

Dec 5,2023 20:20 #Anganwadi Workers
  • ఉప ముఖ్యమంత్రికి అంగన్‌వాడీల వినతి

ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఎనిమిది నుంచి సమ్మెలోకి వెళ్లనున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు మంగళవారం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరకు వినతిపత్రం అందజేశారు. ఆయనను సాలూరు క్యాంపు కార్యాలయంలో యూనియన్‌ పట్టణ అధ్యక్షులు బి.రాధ నాయకత్వాన పలువురు కార్యకర్తలు కలిశారు. తాము గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు అనేక సేవలు అందిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్‌, పెట్రోలు, గ్యాస్‌, ధరలు పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. కేంద్రాల నిర్వహణ బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయడం లేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణకు వివిధ రకాల యాప్స్‌ తెచ్చారని, ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో సెల్‌ సిగల్‌ ఉండడం లేదని, దీనివల్ల అంగన్‌వాడీలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లగా మార్చాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 లక్షలకు పెంచాలని, రాజకీయ జోక్యం అరికట్టాలని, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌, వివిధ రకాల యాప్‌లను రద్దు చేయాలని కోరారు. రాజన్నదొర స్పందిస్తూ, అంగన్‌వాడీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో యూనియన్‌ నాయకులు పార్వతి, చిలకమ్మ, జ్యోతి తదితరులు ఉన్నారు.

➡️