సోమిరెడ్డి దీక్ష భగ్నానికి యత్నం

Dec 19,2023 10:50
  • శిబిరం వద్ద కార్లపై దాడి
  • అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి-పొదలకూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా పొదలకూరులో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను భగం చేసేందుకు కొందరు ప్రయత్నించారు. శిబిరాన్ని ధ్వంసం చేసేందుకు వందమందికిపైగా వచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, టిడిపి నాయకుల కార్లను పగలకొట్టారు. దీంతో, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శిబిరం ధ్వంసానికి వచ్చిన వారిని టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు శిబిరం వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, మైనింగ్‌లో పనిచేస్తున్న 12 టిప్పర్లు, ఆరు హిటాచీ వాహనాలను తీసుకెళ్లేందుకు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి శిబిరంపై దాడి చేయించారని ఆరోపించారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సొంత గ్రామానికి సమీపంలోనే ఇంత దారుణం జరుగుతున్నా ముడుపులు తీసుకుని అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దాడులకు భయపడేది లేదని, దీక్షను కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. తాటిపర్తి పంచాయతీ పరిధిలోని రుస్తుం, భారత్‌ మైకా గనుల్లో క్వార్జ్‌ తవ్వకాలను శనివారం సోమిరెడ్డి పరిశీలించారు. అధికారులు వచ్చి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని, వాహనాలను సీజ్‌ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

➡️