ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి

  • మిస్సింగ్‌ కేసును 48 గంటల్లో చేధించాం
  • గ్రామీణ పాలనా వ్యవస్థను చక్కదిద్దుతాం : ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : ఆడపిల్లల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో గాడి తప్పిన గ్రామీణ పాలనా వ్యవస్థను చక్కదిద్దుతామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. సోమవారం ఆయన కాకినాడ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. తన కూతురు అదృశ్యమైందని ఇటీవల ఒక మహిళ తనకు ఫిర్యాదు చేశారని, దీనిపై వెంటనే విచారణ జరపాలని పోలీసులను తాను ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయి ఆచూకీని పోలీసులు గుర్తించారని, తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించడం అభినందనీయమని అన్నారు. జమ్మూలో పోలీసుల సహకారంతో ఆ అమ్మాయిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా కదలిక రాలేదని విమర్శించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పంచాయతీలన్నీ నిధుల లేమితో అల్లాడాయన్నారు. ఆర్థిక సంఘం నిధులు సైతం పక్కదారి పట్టాయని విమర్శించారు. సీనరేజీ నిధులు పంచాయతీలకు అందలేదన్నారు. దీనిపై కేబినెట్‌ హై లెవెల్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంచాయతీలకు వివిధ శాఖల నుంచి రావాల్సిన వాటాలను గత ఐదేళ్లుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. దీంతో, కొన్ని పంచాయతీల్లో కార్యాలయ నిర్వహణ కూడా భారంగా మారిన పరిస్థితులు ఉన్నాయన్నారు. పంచాయతీలకు రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క ఇసుక అమ్మకం ద్వారానే ఏటా రూ.1000 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వస్తుందన్నారు. దీనిలో పంచాయతీలకు అందాల్సిన ఇసుక సీనరేజ్‌ వాటా ఐదేళ్లలో ఇవ్వలేదన్నారు.

➡️