విద్యాశాఖలో విలీనం చేయాలి 

ssa employees strike 15th day

 

  • రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల ఆందోళన

ప్రజాశక్తి-యంత్రాంగం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సర్వ శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది. కలెక్టరేట్లు, ఆర్‌డిఒ కార్యాలయల వద్ద ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగులందరికీ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు సందర్శించి మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అన్ని ప్రజా సంఘాల మద్దతు కూడగట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. గుంటూరులో ఆర్‌డిఒ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పుష్కరఘాట్‌ వద్ద ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ జలదీక్ష చేశారు. కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ డిఇఒ కార్యాలయాల నిరసనలు తెలిపారు. విశాఖ జిల్లా భీమిలిలో ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆర్‌డిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లిలో కలెక్టర్‌కు, ఆర్‌డిఒకు వినతిపత్రాలు అందించారు. నర్సీపట్నంలో ఎన్‌టిఆర్‌ మినీ స్టేడియంలో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు బిఎస్‌పి నాయకులు మద్దతు తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట గడ్డి తింటూ నిరసన తెలిపారు. సరైన వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నామని, గడ్డి తిని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఎఒకు వినతిని అందజేశారు. శ్రీకాకుళంలోని జ్యోతిరావు ఫూలే పార్కు వద్ద మోకాళ్లపై నిల్చొని అర్ధనగ ప్రదర్శన చేపడుతూ నిరసన తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ప్రధానికి పోస్టుకార్డులు పంపి నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి, ఆర్‌డిఒకు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు టిడిపి, యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. విజయనగరం, కర్నూలు, అన్నమయ్య, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లాల్లో నిరవధిక సమ్మెను కొనసాగించారు.

➡️