కదం తొక్కిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

ssa employees strike arrest vijayawada

– డైరెక్టరు కార్యాలయం ముట్టడి..పలువురి అరెస్ట్‌

-చర్చలకు డైరక్టర్‌ హామీ

– తొలగింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవడానికి అంగీకారం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: తమ సమస్యలు పరిష్కారం కోసం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కదం తొక్కారు. 16 రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోపాటు తొలగింపులకు కూడా సిద్ధం కావడంతో జిల్లాల నుండి వేలాది మంది ఉద్యోగులు శుక్రవారం విజయవాడకు తరలివచ్చారు. సమగ్ర శిక్షా డైరెక్టరు కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వీరిని పోలీసులు నిలువరించలేకపోయారు. నాయకులను డైరెక్టరు వద్దకు రాయబారం తీసుకువెళ్ళి మాట్లాడించారు. అంతకుముందు వేలాది మంది ఉద్యోగులు విజయవాడలోని పటమట రైతు బజార్‌ వద్దనున్న డైరెక్టరు కార్యాలయం వద్దకు తరలివచ్చారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు అన్ని వైపులా బారికేడ్లు పెట్టి భారీ ఎత్తులో మోహరించారు. రైతు బజార్‌ వైపు కొంతమంది, ఆటోనగర్‌వైపు కొంతమంది ఉద్యోగులు పోలీసుల కళ్లు గప్పి డైరెక్టరు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రెండువైపులా మోహరించిన పోలీసులు వీరిని అటువైపు వెళ్లకుండా దొరికిన వారిని దొరికినట్లు బలవంతంగా అరెస్టులకు పూనుకున్నారు. పోలీసుల అరెస్టులతో ఆటోనగర్‌ వైపు వెళ్లే రోడ్డు, రైతు బజార్‌ రోడ్డు రణరంగంగా మారింది. ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్టు అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అధ్యక్షులు బి కాంతారావుతోపాటు పలువురు నాయకులను పోలీసులు ముందుగా అరెస్టు చేశారు. ఉద్యోగులకు మద్దతుగా ఆందోళనలో పాల్గన్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. సుమారు మూడు గంటల పాటు పోలీసులు సమగ్ర శిక్షా డైరెక్టరు కార్యాలయ ప్రాంతాన్ని ఉద్యోగుల అరెస్టుతో రణరంగంగా మార్చారు. ఈ అరెస్టులు తరువాత కూడా వందల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చి ఆందోళనకు దిగారు.దీంతో సమగ్ర శిక్షా డైరెక్టరు బి శ్రీనివాసరావు వద్దకు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరావు, ఫెడరేషన్‌ నాయకులను రాయబారం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రగ్యులరైజ్‌ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఎ, డిఎతో మినిమం టైం స్కేల్‌ రూ.26 వేలు చెల్లించాలని, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రూ.10 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని తదితర డిమాండ్లను నాయకులు ప్రస్తావించారు. ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నామని నాయకులతో డైరెక్టరు చెప్పారు. మంత్రితో మాట్లాడి చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరించేలా తొలగింపు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర నాయకులు ప్రస్తావించగా తొలగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని డైరక్టర్‌ హామీ ఇచ్చారు. దీంతో ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నారు. సమ్మె మాత్రం కొనసాగుతుందని తెలిపారు.పలువురికి గాయాలుపోలీసుల అరెస్టులతో ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు ఎవి నాగేశ్వరరావుతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఎవి నాగేశ్వరరావుకు చేతివేలు విరిగింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పైడిరాజుకు కాలు విరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితోపాటు మరికొంతమందికి గాయాలయ్యాయి.

 

అక్రమంగా అరెస్టు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి PDF ఎమ్మెల్సీ I.వెంకటేశ్వరరావు

 

 

ssa employees strike arrest vijayawada vzm

  • అక్రమ అరెస్టులకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా

విజయనగరం టౌన్ :  శుక్రవారం చలో విజవాడకు తరలి వెళ్ళిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ జె ఏ సి నాయకులు అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి నాయకులు కె.త్రినాధరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని 17 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని చలో విజయవాడకు వెళ్తే పోలీసులు అన్యాయంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️