అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

– రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఎస్‌ఎస్‌ఎల ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం:సర్వశిక్ష అభియాన్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారం 18వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనను కొనసాగించారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ పాలసీ, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని నినదించారు. విజయనగరం జిల్లా బైక్‌ ర్యాలీలో ఆ సంఘం జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు, సిఆర్‌పి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం చలో విజయవాడ కార్యక్రమాన్ని అణచివేసే చర్యలను ఖండించారు. అరెస్టులతో ఉద్యమాన్ని, తమ గొంతును నొక్కడం సరికాదని అన్నారు. అనకాపల్లి డిఇఒ కార్యాలయం ఎదుట ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు నిద్రకు ఉపక్రమించి నిరసన తెలిపారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సమ్మెను కొనసాగించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ధర్నా చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద సమ్మె శిబిరాన్ని టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమ మహేశ్వరరావులు సందర్శించి మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మోకాళ్లపై నిలబడి అర్ధనగ ప్రదర్శన చేశారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద విధుల్లో చేరకపోతే సమగ్ర శిక్ష ఉద్యోగులను తొలగిస్తామంటూ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌లను దగ్ధం చేశారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తూ దారిన వెళ్లే వారికి పూలు అందజేసి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపి ప్రసంగించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో సమ్మెను కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టినా, ఆంక్షలు విధించినా పోరాటం చేస్తామని ఎస్‌ఎస్‌ఎలు ప్రకటించారు.

➡️